Telangana: ట్రాఫిక్ చలాన్లపై 50 శాతం మాఫీ అంటూ నకిలీ వార్త.. హైదరాబాద్ లో ఎగబడ్డ వాహనదారులు!

  • సోషల్ మీడియాలో నకిలీ వార్తలు
  • గోషామహల్ స్టేషన్ వద్దకు రావాలని సూచన
  • తలలు పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు

సోషల్ మీడియాతో ప్రయోజనాలు ఎన్నున్నాయో నష్టాలు కూడా అన్నే ఉంటున్నాయి. ఇందుకు తాజా ఘటనే ఉదాహారణ. ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నవారు వెంటనే హైదరాబాద్, గోషామహల్ స్టేడియం వద్దకు రావాలని ఈరోజు సోషల్ మీడియాలో ఓ సందేశం ప్రత్యక్షమయింది. గోషామహల్ వద్ద పోలీసులు ఈరోజు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారనీ, చలాన్లు చెల్లించేవారికి 50 శాతం రాయితీ లభిస్తుందని అందులో చెప్పారు. అసలే ఆదివారం, ఆపై చలాన్లలో 50 శాతం రాయితీ ఆఫర్ కావడంతో వాహనదారులు గోషా మహల్ స్టేడియం వద్దకు పోటెత్తారు.

తొలుత అసలు ఏం జరుగుతుందో అర్థం కాని ట్రాఫిక్ పోలీసులు, ఆ తర్వాత ఇది ఎవరో కావాలని చేసిన ప్రాంక్ అని తేల్చేశారు. తాము ఎలాంటి లోక్ అదాలత్ నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. దీంతో వారంతా ఉసూరుమంటూ నిరాశగా వెనుదిరిగారు. కాగా, ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

More Telugu News