aravind swami: 'మీటూ'పై ప్రశ్నకు అరవిందస్వామికి కోపం వచ్చేసింది!

  • ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెప్పొచ్చు 
  • అవకాశాన్ని పబ్లిసిటీ కోసం వాడకూడదు 
  • ఈ విషయంలో నా స్పందన అనవసరం     

హాలీవుడ్ .. బాలీవుడ్ .. కోలీవుడ్ .. ఇలా వివిధ భాషలకి చెందిన చిత్రపరిశ్రమలలో మీటూ ఉద్యమం జోరుగా జరుగుతోంది. ఈ విషయంపై ఆయా భాషలకి చెందిన ప్రముఖులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తమిళ చిత్రపరిశ్రమలో చిన్మయి .. వైరముత్తు వివాదం అందరికీ తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ, మీటూ ఉద్యమంపై స్పందన ఏమిటనే ప్రశ్న ప్రముఖ నటుడు అరవింద స్వామికి ఎదురైంది.

ఆ ప్రశ్నపట్ల ఆయన చాలా అసహనాన్ని వ్యక్తం చేస్తూ .. "ప్రస్తుతం ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అందుబాటులో వుంది. ఎవరి అభిప్రాయాలను వాళ్లు వ్యక్తం చేసే అవకాశం .. హక్కు రెండూ వున్నాయి. అయితే అవకాశాన్ని అడ్డు పెట్టుకుని పబ్లిసిటీని పొందాలని చూడకూడదు. ఒక వ్యక్తిపై ఆరోపణలు జరుగుతున్నప్పుడు .. తగినంత సమాచారం లేకుండా ఆ వ్యక్తిని నేను ఎలా తిట్టగలను? కేవలం ఒకరు చేస్తోన్న ఆరోపణలను ఆధారంగా చేసుకుని మరొకరిని నేను ఎలా నిందించగలను? ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వ్యక్తిగతమైన సమస్య .. దీనికి నా స్పందన అడగడం కూడా కరెక్ట్ కాదు" అని అన్నారు.

More Telugu News