IRCTC: ముంబై-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు షాక్.. బ్రేక్‌ఫాస్ట్‌గా కంపుకొట్టే ఆహారం!

  • కాలం చెల్లిన ఆహార పదార్థాల సరఫరా 
  • ఐఆర్‌సీటీసీ తీరుపై ప్రయాణికుల ఆగ్రహం
  • సికింద్రాబాద్‌లో ఫిర్యాదు

ముంబై-సికింద్రాబాద్ మధ్య నడిచే దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికులకు భయంకరమైన అనుభవం ఎదురైంది. ప్రయాణికులకు బ్రేక్ ఫాస్ట్‌గా పంపిణీ చేసిన బిస్కెట్లు, స్నాక్స్, టీ బ్యాగ్స్ అన్నీ కాలం చెల్లినవే. కంపుకొడుతున్న వాటిని చూసిన ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. ప్రయాణికులకు సరఫరా చేసినవన్నీ నెల క్రితమే కాలం చెల్లినవి కావడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైలులోని కేటరింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ప్రయాణికుల ఫిర్యాదుకు సిబ్బంది సరిగా స్పందించకపోవడంతో వారు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. దేవాన్ష్ దామని అనే వ్యక్తి వెంటనే ఐఆర్‌సీటీసి హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.

దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైలులో కేటరింగ్ సర్వీస్ కోసం అదనంగా సూపర్ ఫాస్ట్ సర్ చార్జీ వసూలు చేస్తారు. బుధవారం రాత్రి లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్‌టీటీ)లో రైలు ఎక్కిన ప్రయాణికులకు కేటరింగ్ సిబ్బంది గురువారం ఉదయం మురిగిపోయిన ఆహారం అందించారు. కొందరు ప్రయాణికులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో వార్త ఒక్కసారిగా వైరల్ అయింది. రైలు సికింద్రాబాద్ చేరుకున్న తర్వాత ఆన్ డ్యూటీ ఆఫీసర్‌కు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన ఈ ఘటనపై దర్యాప్తు చేపడతామని హామీ ఇచ్చారు.

More Telugu News