Telangana: కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్.. నేడు టీఆర్ఎస్ లో విలీనం కోసం లేఖ ఇవ్వనున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీలు!

  • చైర్మన్ ను కలుసుకోనున్న నలుగురు నేతలు
  • అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్
  • అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్న స్వామిగౌడ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీకి మరో చావుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీని శాసనమండలిలో తుడిచిపెట్టే దిశగా అధికార టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా అదే పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలతో విలీనం లేఖను మండలి చైర్మన్ స్వామిగౌడ్ కు ఇచ్చేలా మాస్టర్ ప్లాన్ వేసింది.  కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఎం.ఎస్.ప్రభాకర్, దామోదర్ రెడ్డి ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం సీఎం కేసీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్ భేటీ అయ్యారు.

మరికాసేపట్లో తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ ను కలుసుకోనున్న ఈ నలుగురు నేతలు, టీఆర్ఎస్ లో కాంగ్రెస్ మండలి విభాగం విలీనం కోసం లేఖ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనమండలిలో ఆరుగురు సభ్యులు ఎన్నికయ్యారు. వీరిలో మండలి పక్షనేతగా షబ్బీర్ అలీ ఉండగా, ఉపనేతగా పొంగులేటి సుధాకర్ రెడ్డి ఉన్నారు. మిగతా నలుగురు నేతలు కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిపోయారు. మరోవైపు మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఇప్పటికే అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

More Telugu News