Andhra Pradesh: తెలంగాణలో పరిస్థితుల వల్లే కానీ.. ఏపీలో మాత్రం టీడీపీతో పొత్తు ఉండదు: కాంగ్రెస్ నేత పళ్లంరాజు

  • టీడీపీతో పొత్తు అధిష్ఠానం చూసుకుంటుంది
  • తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి టీడీపీ కారణం కాదు
  • మోదీ ఏపీకి వచ్చే అర్హత కోల్పోయారు: రఘువీరా

తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్.. ఏపీలోనూ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందన్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు స్పందించారు. తెలంగాణలోని పరిస్థితుల ప్రభావం వల్ల అక్కడ టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని, ఏపీలో ఆ పరిస్థితి రాకపోవచ్చని అన్నారు. అయితే, ఈ విషయంలో అధిష్ఠానానిదే తుది నిర్ణయమని తేల్చి చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణలో చేసిన అభివృద్ధి గురించి సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడం తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఓ కారణమన్నారు. టీడీపీ వల్లే అక్కడ ఓడామని చెప్పడం సరికాదన్నారు. గురువారం కాకినాడలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్‌ నేతల సమావేశంలో పళ్లంరాజు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల పక్షాన మాట్లాడని వైసీపీ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో ఎందుకు పోటీచేశారో తనకు అర్థం కావడం లేదన్నారు.  

మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉన్నా లేనట్టేనని విమర్శించారు. నాయకులు, కేడర్ మధ్య సమన్వయ లేమితోనే తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయినట్టు చెప్పారు. రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల సందర్బంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చెప్పారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికలు ప్రత్యేక హోదా అంశంపైనే జరుగుతాయని అన్నారు. రాష్ట్రానికి వచ్చే అర్హతను మోదీ కోల్పోయారని, ఒకవేళ వస్తే ప్రజలు నల్లజెండాలతో నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు.

More Telugu News