మరో నెగిటివ్ రోల్ కి ఓకే చెప్పిన వరలక్ష్మీ శరత్ కుమార్

20-12-2018 Thu 13:46
  • నాగేశ్వర రెడ్డి నుంచి కామెడీ ఎంటర్టైనర్ 
  • సందీప్ కిషన్ జోడీగా హన్సిక
  • హీరోయిన్ కి వదినగా వరలక్ష్మి     
తమిళనాట కథానాయికగా పరిచయమైన వరలక్ష్మీ శరత్ కుమార్, కొత్తదనం కలిగిన కీలకమైన పాత్రలను చేయడానికి ఎంతమాత్రం వెనుకాడటం లేదు. 'పందెం కోడి 2' .. 'సర్కార్' చిత్రాల్లో ఆమె నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలను పోషించింది. ఈ పాత్రలు మంచి పేరు తీసుకురావడంతో, అదే తరహా పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.

 త్వరలో 'మారి 2' సినిమాతో పలకరించనున్న వరలక్ష్మీ శరత్ కుమార్, తొలిసారిగా తెలుగులో ఒక సినిమా చేయడానికి అంగీకరించింది .. ఆ సినిమానే 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'. సందీప్ కిషన్ కథానాయకుడిగా జి.నాగేశ్వర రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా హన్సిక నటిస్తుండగా, కీలకమైన పాత్ర కోసం వరలక్ష్మీ శరత్ కుమార్ ను తీసుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ కి వదినగా నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రను చేయనుందట. ఈ కామెడీ ఎంటర్టైనర్లో వరలక్ష్మీ శరత్ కుమార్ ఎలా మెప్పిస్తుందో చూడాలి మరి.