kcr: మూడు గంటల పాటు కేసీఆర్ చెప్పింది విని దిగ్భ్రాంతికి గురయ్యా: ఒవైసీ

  • కేసీఆర్ లా ఎన్నికల వ్యూహరచన మరెవరూ చేయలేరు
  • కాంగ్రెస్ నేతలు ఎవరెవరు ఎలా ఓడిపోతారో చెబుతుంటే ఆశ్చర్యపోయా
  • రేవంత్ రెడ్డి ఓడిపోతాడని కేసీఆర్ చెప్పారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న రాజకీయ పరిజ్ఞానంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేస్తారని అందరూ అంటుంటారని... కానీ, ఆయన చేసినట్టు ఎన్నికల వ్యూహరచన, ఎన్నికల నిర్వహణ మరెవరూ చేయలేరని అన్నారు.

ఇటీవల కేసీఆర్ ఇంటికి వెళ్లినప్పుడు మూడు గంటల పాటు ఆయన చెప్పిన వివరాలు తనకు దిగ్భ్రాంతిని కలిగించాయని చెప్పారు. టీఆర్ఎస్ కు ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారని కేసీఆర్ తనను అడగ్గా.. 65 నుంచి 70 వరకు వస్తాయని తాను చెప్పానని... కానీ, టీఆర్ఎస్ కు 90 సీట్లు వస్తాయని, ఎలా వస్తాయో చెబుతాను వినండి అంటూ చెప్పడం ప్రారంభించారని అన్నారు. కాంగ్రెస్ కీలక నేతలు ఎవరెవరు ఓడిపోతారో ఆయన కచ్చితంగా చెప్పారని తెలిపారు.

ఉత్తమ్ భార్య పద్మావతి, కొండా సురేఖ, డీకే అరుణ, పొన్నం, జానారెడ్డి.. ఇలా ఒక్కొక్కరు ఎలా ఓడిపోతారో కేసీఆర్ చెబుతుంటే... ఆయన ఆత్మవిశ్వాసం చూసి, తాను ఆశ్చర్యపోయానని ఒవైసీ అన్నారు. రేవంత్ రెడ్డి గెలుస్తాడా? అని కేసీఆర్ తనను ప్రశ్నించగా... గెలుస్తాడనే అనిపిస్తోందని చెప్పానని అన్నారు. అయితే... 'మీ అంచనా తప్పు. రేవంత్ ఓడిపోతాడు' అని కేసీఆర్ తనకు చెప్పారని తెలిపారు.

ప్రతి నియోజకవర్గంలో కులాలు, మతాలు, వివిధ సామాజికవర్గాలు ఎలా ఉన్నాయో కేసీఆర్ కు పూర్తి అవగాహన ఉందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఓటర్ల నాడి, అక్కడి సమస్యలు, నేతల బలాలు అన్నీ కేసీఆర్ కు తెలుసని అన్నారు. ఇంత పరిజ్ఞానం ఉన్న నాయకుడు కాంగ్రెస్ లో లేరని... జైపాల్ రెడ్డికి కొంత తెలిసి ఉండవచ్చని తెలిపారు. 

More Telugu News