Andhra Pradesh: ఏపీకి ఏ మొహం పెట్టుకుని వస్తారు?: బీజేపీ నేతలకు రఘువీరా రెడ్డి సూటి ప్రశ్న

  • విశాఖలో ద్రోణంరాజు జయంతి వేడుకలు
  • పాల్గొన్న రఘువీరా, కిరణ్ కుమార్ రెడ్డి, ఊమెన్ చాందీ
  • విభజన హామీల అమలులో బీజేపీ విఫలమైందన్న నేతలు

విభజన హామీలు అమలు చేయని బీజేపీ నేతలు తిరిగి ఏ మొహం పెట్టుకుని ఏపీలో అడుగుపెడతారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ రఘువీరా రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, రాహుల్ ప్రధాని అయితే ఆయన పెట్టే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా పైనేనని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ జయంతి వేడుకలను విశాఖపట్టణంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాంది, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి రఘువీరా రెడ్డి ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ఏపీలో 25 లోక్‌సభ స్థానాల్లోనూ కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. విభజన హామీలు అన్నింటినీ అమలు చేసిన తర్వాతే బీజేపీ నేతలు ఏపీలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ గెలుపు అనివార్యమన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో యూపీఏ అధికారంలోకి వచ్చి, రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఏపీకి హోదా వస్తుందని అన్నారు. యూపీఏ అధికారంలోకి వచ్చిన వెంటనే విభజన హామీలను అమలు చేస్తామని ఊమెన్ చాందీ అన్నారు.

More Telugu News