Jammu And Kashmir: ఇక జమ్మూకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన!

  • నేటితో ముగియనున్న గవర్నర్ పాలన
  • ఈరోజు అర్ధరాత్రి నుంచి రాష్ట్రపతి పాలన అమల్లోకి
  • సంబంధిత ఉత్తర్వులపై సంతకం చేసిన రాష్ట్రపతి  

జమ్మూకశ్మీర్ లో ఈ ఏడాది జూన్ లో రాజకీయ సంక్షోభం తలెత్తడంతో అప్పటి నుంచి ఆ రాష్ట్రంలో గవర్నర్ పాలన కొనసాగింది. నేటితో ఆ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. ఈ విఙ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధింపుకి నిర్ణయం తీసుకుంది.

ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేసి ఆమోదం తెలిపారు. దీంతో ఈరోజు అర్ధరాత్రి నుంచి జమ్మూకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన అమల్లోకి రానుంది. కాగా, బీజేపీ మద్దతుతో ఇంతకుముందు పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, బీజేపీ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో పీడీపీ ప్రభుత్వం కుప్పకూలింది. గత నెల 21న జమ్మూకశ్మీర్ అసెంబ్లీని గవర్నర్ రద్దు చేశారు. అసెంబ్లీ రద్దయిన ఆరు నెలల్లోపే రాష్ట్రంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, జమ్మూకశ్మీర్ లో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరిగే సమయంలోనే అసెంబ్లీ ఎన్నికలూ నిర్వహించాలని ఈసీ భావిస్తోంది.

More Telugu News