Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహిస్తామంటే.. క్లారిటీ ఇచ్చిన స్పీకర్ కోడెల!

  • సమావేశాల నిర్వహణ కోసం సమయం ఉంది
  • ఏపీ ప్రభుత్వం నుంచి ఇంకా ప్రతిపాదన రాలేదు
  • బడ్జెట్, వర్షకాల సమావేశాలు సంపూర్ణంగా సాగాయి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు తెలిపారు. సభ నిర్వహణకు తగిన గడువు ఉందని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు. నిబంధనల మేరకు ప్రతి 6 నెలలకు ఓసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు. అమరావతిలో ఈరోజు స్పీకర్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు, వర్షకాల సమావేశాలు తగినన్ని రోజులు జరిగాయని అభిప్రాయపడ్డారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను 2019, మార్చిలో ప్రవేశపెడతామని తెలిపారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ముందు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలా? వద్దా? అన్నది ప్రభుత్వం ఇష్టమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏమనుకుంటుందో తనకు స్పష్టత లేదని తేల్చిచెప్పారు. కోడెల ఈరోజు వైసీపీ నేత తిప్పేస్వామి చేత మడకశిర ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయించిన సంగతి తెలిసిందే.

More Telugu News