BJP: కొంప మునగక ముందే మారండి: నరేంద్ర మోదీకి పాశ్వాన్ హెచ్చరిక

  • మరిన్ని పార్టీలు వెళ్లిపోకముందే చర్యలు చేపట్టండి
  • టీడీపీ వెళ్లిన తరువాత ఎన్డీయే కష్టాలు మొదలు
  • ట్విట్టర్ లో ఎల్జేపీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నుంచి మరిన్ని పార్టీలు వైదొలగక ముందే నరేంద్ర మోదీ మారాలని రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు, ఎల్జేపీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ హెచ్చరించారు. కేంద్ర మంత్రి పదవికి ఉపేంద్ర కుశాహ్వ రాజీనామా చేస్తూ, ఎన్డీయే నుంచి రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ బయటకు వస్తున్నట్టు ప్రకటించిన రోజుల తరువాత చిరాగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

తెలుగుదేశం పార్టీ బయటకు వెళ్లిపోయిన తరువాత ఎన్డీయేకు కష్టాలు ప్రారంభమయ్యాయని, సహచర పార్టీలతో ఉన్న విభేదాలను పరిష్కరించడంలో బీజేపీ పెద్దలు విఫలమవుతున్నారని ఆయన అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ ట్వీట్ ను పెడుతూ "ఎన్డీయే నుంచి టీడీపీ, ఆర్ఎల్ఎస్పీ వెళ్లిపోవడంతో క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి మరింత దారుణంగా మారకముందే బీజేపీ చర్యలు తీసుకోవాలి. పూర్తిగా చేతులు కాలకముందే గౌరవప్రదమైన పద్ధతిలో భాగస్వాముల సమస్యలు పరిష్కరించాలి" అని అన్నారు.

కాగా, లోక్ సభ ఎన్నికలకు సీట్ల పంపకం విషయంలో బీజేపీ, ఎల్జేపీల మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాము ఎన్నిమార్లు బీజేపీ నేతలతో చర్చించినా, కూటమిలో సీట్ల పంపకం విషయంలో ఓ అంగీకారానికి రాలేకపోయామని, బీజేపీ నిర్ణయాల కారణంగా నష్టమే అధికంగా జరిగేట్టు కనిపిస్తోందని చిరాగ్ వ్యాఖ్యానించడం గమనార్హం. కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలకు గౌరవ ప్రదమైన సంఖ్యలో సీట్లను ఇచ్చేందుకు బీజేపీ నిరాకరిస్తోందని కూడా ఆయన ఆరోపించారు. లోక్ సభ సీట్ల విషయంలో తామేమీ త్యాగాలు చేయబోమని తేల్చి చెప్పారు.

More Telugu News