property: రూ.285 కోట్ల ఆస్తి కోసం.. చనిపోయిన తల్లిని బతికున్నట్టు చూపిన కుమారుడు!

  • కోట్ల రూపాయల ఆస్తిని కొట్టేయాలని చూసిన అన్న
  • నకిలీ డాక్యుమెంట్ల సృష్టి
  • కోర్టుకెక్కిన తమ్ముడు

రూ.285 కోట్ల ఆస్తిని సొంతం చేసుకునేందుకు చనిపోయిన తల్లిని బతికి ఉన్నట్టు చూపించిన వ్యక్తిని అతడి సోదరుడి ఫిర్యాదు మేరకు నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని హీరానందని గార్డెన్స్‌లో నిందితుడు సునీల్ గుప్తా, అతడి భార్య రాధ, కుమారుడు అభిషేక్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు నోయిడా కోర్టులో ప్రవేశపెట్టారు.

ఆస్తిని సొంతం చేసుకునేందుకు చనిపోయిన తన తల్లి బతికే ఉందంటూ పేపర్లపై చూపిస్తున్నాడని పేర్కొంటూ సునీల్ గుప్తా సోదరుడు విజయ్ గుప్తా నోయిడాలోని జిల్లా కోర్టును ఆశ్రయించారు. సునీల్ గుప్తా, అతడి భార్య రాధ, ఇద్దరు కుమారులతోపాటు మరో ఐదుగురు వ్యక్తులు ఈ కుట్రలో భాగస్వాములని పేర్కొంటూ కేసు వేశాడు. దీనిని స్వీకరించిన కోర్టు సునీల్ గుప్తాపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

2011 మార్చి ఏడో తేదీన సునీల్ గుప్తా తల్లి కమలేష్ రాణి మృతి చెందింది. ఓ కొవ్వొత్తుల తయారీ కంపెనీ సహా మొత్తం రూ.285 కోట్ల విలువైన ఆస్తి ఆమె పేరిట ఉంది. ఈ ఆస్తిపై కన్నేసిన ఆమె పెద్ద కుమారుడు సునీల్ గుప్తా దానిని తల్లి తన పేరున బదలాయించినట్టు నకిలీ పత్రాలు సృష్టించాడు.  నిజానికి ఆమె చనిపోయిన తర్వాత ఆస్తిని తాము సమానంగా పంచుకోవాల్సి ఉందని, కానీ సోదరుడు సునీల్ దుర్బుద్ధితో ఆస్తిని కాజేయాలని చూశాడని విజయ్ ఆరోపించాడు. ఫోర్జరీ సంతకాలతో ఆస్తిని కాజేయాలని చూస్తున్నాడని ఆరోపిస్తూ కోర్టుకెక్కాడు. విచారించిన కోర్టు సునీల్ గుప్తాపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన నోయిడా పోలీసులు సునీల్ గుప్తా, ఆయన భార్య రాధ, కుమారులను అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం జైలుకు తరలించారు.

More Telugu News