jayalalitha: జయలలిత చికిత్స ఖర్చు రూ. 6.86 కోట్లు.. చెల్లించింది రూ.6.41 కోట్లు: రెండేళ్ల తర్వాత వెల్లడించిన అపోలో ఆసుపత్రి

  • జయలలిత చికిత్స ఖర్చు వివరాలను విడుదల చేసిన అపోలో
  • ఇంకా రూ.44 లక్షలు బాకీ
  • ఆసుపత్రిలో నేతల ఖర్చు రూ. 2 కోట్లు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత చికిత్సకు అయిన ఖర్చులకు సంబంధించిన వివరాలను అపోలో ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి. జయలలిత చనిపోయిన రెండేళ్ల తర్వాత ఈ వివరాలు విడుదల చేయడం గమనార్హం. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆమె మృతి చెందే వరకు చికిత్స కోసం మొత్తం రూ.6.86 కోట్ల బిల్లు అయిందని పేర్కొంది.

ఇందులో హెల్త్ కేర్ సర్వీసెస్‌కు రూ.1.92 కోట్లు, కన్సల్టేషన్ ఫీజు రూ.71లక్షలు, వైద్య పరికరాల వినియోగ ఖర్చు రూ.7.10 లక్షలు, మందుల ఖర్చు రూ. 38 లక్షలు, రూము అద్దె రూ. 24 లక్షలు, లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ బీలే వైద్య సేవలకు రూ.92 లక్షలు, సింగపూర్ ఆసుపత్రి మౌంట్ ఎలిజబెత్ వైద్య బృందం సేవలకు రూ. 12 లక్షలు ఖర్చు అయినట్టు బిల్లులో పేర్కొన్నారు. ఈ మొత్తం బిల్లులో ఇప్పటి వరకు  రూ. 6.41 కోట్లను మాత్రమే చెల్లించారని ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది. ఇంకా రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉందని తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్లు కాపీని విడుదల చేసింది.

జయను పరామర్శించేందుకు వచ్చిన నేతల బస, తిండి ఖర్చులు ఇందుకు అదనమని, ఆ బిల్లు రూ. 2 కోట్లని అపోలో పేర్కొంది. జయలలితతోపాటు నేతలు కూడా దాదాపు 75 రోజుల పాటు అక్కడే ఉన్నారని, ఇందుకోసం 14 రూములు బుక్ చేసుకున్నారని తెలిపింది. జయ చికిత్స కోసం అయిన ఖర్చులో ఆరు కోట్ల రూపాయలను పార్టీ ఫండ్ నుంచి చెల్లించినట్టు అన్నాడీఎంకే నేతలు తెలిపారు.

  • Loading...

More Telugu News