bhairavapalem: నష్టపోయిన రైతులందరికీ మరి కొన్ని రోజుల్లోనే ఆర్థికసాయం అందజేస్తాం: సీఎం చంద్రబాబు

  • తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు
  • ఆస్తి నష్టం ఎంత జరిగిందో అంచనా వేస్తున్నాం
  • బాధితులందరికీ వరదసాయం అందిస్తామని హామీ

పెథాయ్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పర్యటించారు. పర్యటనలో భాగంగా భైరవపాలెంలో తుపాన్ బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం, మీడియాతో  చంద్రబాబు మాట్లాడుతూ, తుపాన్ తీరం దాటిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించానని చెప్పారు. తుపాన్ బాధితులందరికీ వరదసాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇరవై రెండేళ్ల క్రితం హరికేన్ తుపాన్ సమయంలో తాను ఇక్కడే ఉన్నానని, అప్పట్లో 99 మంది చనిపోయిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. పెథాయ్ తుపాన్ కారణంగా ఎవరూ చనిపోలేదని, అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. తుపాన్ ఎక్కడొస్తుంది, ఎంత తీవ్రతతో వస్తుందన్న విషయాలను కరెక్టుగా అంచనా వేశామని, అందువల్లే ప్రాణనష్టం జరగకుండా చూడగలిగామని, ఎవరూ బాధపడకుండా, ఇబ్బంది పడకుండా చేశామని చెప్పారు.

ఆస్తి నష్టం ఎంత జరిగిందో అంచనా వేస్తున్నామని, ఎవరికీ నష్టం లేకుండా ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామని, నష్టపోయిన రైతులందరికీ మరికొన్ని రోజుల్లోనే ఆర్థికసాయం అందజేస్తామని అన్నారు.తమ పనితీరుపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం వాళ్లకు అలవాటేనని, అది  వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. తాను ప్రజల మనిషిని అని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను పరిష్కరించానని, ప్రతిపక్షాలు కేవలం విమర్శలకే పరిమితమయ్యాయని అన్నారు. ప్రతిపక్షాలు చేసే విమర్శల్లో పసలేదని, వాటికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు.

More Telugu News