pethai: తుపాను పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ఏపీ మంత్రులు

  • పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం
  • పది వేల విద్యుత్ స్తంభాలను సిద్ధంగా ఉంచాం
  • ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు: నారాయణ

ఏపీలో పెథాయ్ తుపాను పరిస్థితిని ఆర్టీజీ కేంద్రం నుంచి మంత్రులు లోకేశ్, కళావెంకట్రావు, శ్రావణ్ లు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, పదివేల విద్యుత్ స్తంభాలను సిద్ధంగా ఉంచామని, పునరావాస కేంద్రాల్లో భోజనం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామని, ముందస్తు సమాచారంతో రైతులు పంటలు కోశారని, కోసిన పంటను కొనుగోలు చేసే పనులు చేపట్టినట్టు చెప్పారు. పంటనష్టంపై అధికారులు అంచనా వేస్తున్నట్టు స్పష్టం చేశారు.  

 విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టాం: తూ.గో. కలెక్టర్ 

తూర్పుగోదావరి జిల్లాలో 28 వేల మందికి భోజనం, సదుపాయాలు కల్పిస్తున్నామని ఆ జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లాలో వృద్ధులు, పిల్లలకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలోని 98 గ్రామాల్లో విద్యుత్ సరఫరా లేదని, కాకినాడలో విద్యుత్ సరఫరా పునురుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టామని, ఈరోజు రాత్రిలోగా 80 గ్రామాలకు విద్యుత్ సరఫరా అందేలా చూస్తామని అన్నారు. రేపు సాయంత్రం లోగా జిల్లా అంతటా విద్యుత్ సరఫరా ఉండేలా చూస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిన సమాచారం అందుతోందని, ఆర్టీసీ బస్సు సేవలు మళ్లీ పునరుద్ధరిస్తామని అన్నారు. ప్రస్తుతం జిల్లాలోని రహదారులపై ఎక్కడా అడ్డంకులు లేవని, నిన్న మధ్యాహ్నం నుంచి రంగంలోకి దిగిన 47 బృందాలు వాటిని తొలగించాయని తెలిపారు. అనుకున్న దాని కంటే తుపాను ప్రభావం తక్కువగా ఉందని, పంటనష్టంపై ఈరోజు సాయంత్రం ఏడు గంటల వరకు ప్రాథమిక సమాచారం అందుతుందని పేర్కొన్నారు.

More Telugu News