nithin: తమిళ హిట్ మూవీపై మనసు పారేసుకున్న నితిన్

  • తమిళంలో విజయాన్ని అందుకున్న 'రాచ్చసన్'
  • తెలుగు రీమేక్ కి సన్నాహాలు 
  • దర్శకుడిగా సుధీర్ వర్మ చేసే అవకాశం

కొంతకాలంగా వరుస పరాజయాలతో నితిన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఎలాంటి కథలను ఎంచుకుంటే బాగుంటుందనే ఆలోచనలో పడిన ఆయన, కొంత గ్యాప్ తీసుకుని వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఏ దర్శకుడితో ఎలాంటి కథను చేయాలా అని అనుకుంటున్న ఆయనకి, తమిళంలో హిట్ కొట్టిన 'రాచ్చసన్' దృష్టిలోకి వచ్చిందట.

విష్ణు విశాల్ .. అమలాపాల్ జంటగా తమిళంలో రామ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా అక్కడ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది తమిళంలో వచ్చిన వైవిధ్యభరితమైన సినిమాల్లో ఒకటిగా స్థానం సంపాదించుకుంది. అలాంటి ఈ సినిమా తెలుగు రీమేక్ లో తాను చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి నితిన్ వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. తెలుగులో ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తివివరాలు తెలియనున్నాయి. 

More Telugu News