TPCC: బీసీ గణన జరిగాకే పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు చేయాలి : టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు

  • ముఖ్యమంత్రికి, పంచాయతీరాజ్‌ సెక్రటరీకి లేఖ
  • తప్పులు పునరావృతం కాకుండా చూడాలని వినతి
  • కొత్త ఓటర్ల జాబితా రూపొందించి బీసీ గణన జరపాలని వినతి

కొత్త ఓటర్ల జాబితాను రూపొందించాక దాని ఆధారంగా బీసీ జనాభాను గణన చేయాలని, ఆ తర్వాతే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. గాంధీభవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆ లేఖను విడుదల చేశారు. ఈ అంశాలకు సంబంధించి గతంలో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను కూడా లేఖతో జతచేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ  బీసీ జనాభా గణన విషయంలో గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూడాలని ముఖ్యమంత్రిని వేడుకుంటున్నట్లు తెలిపారు. బీసీల్లోని ఉపకులాల గణన కచ్చితంగా జరిగి దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని, లేదంటే బీసీలంతా రోడ్డు మీదకి వచ్చి రగడ చేయాల్సి ఉంటుందని చెప్పారు. సమగ్ర అధ్యయనం చేయకుండానే పంచాయతీరాజ్‌ చట్టాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు.

More Telugu News