Telangana: చంద్రబాబు అలా కనిపిస్తున్నారా నీకు.. ఆ విషయం మర్చిపోకు!: కేటీఆర్ పై టీడీపీ నేత రావుల ఫైర్

  • చంద్రబాబు వల్లే ఐటీ సంస్థలు వచ్చాయని నువ్వే చెప్పావ్
  • నిన్ను గెలిపించేందుకు చంద్రబాబు కృషి చేశారు
  • సమైక్యాంధ్రకు మద్దతిచ్చిన వారు మీకు మిత్రులా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని గల్లీ లీడర్ అన్న టీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో రావుల మాట్లాడారు. మాట్లాడే ముందు గతాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్‌కు ఐటీ సంస్థలు వచ్చాయని పారిశ్రామిక వేత్తల సదస్సులో స్వయంగా కేటీఆరే చెప్పిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు.

మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు భాగ్యనగరానికి రావడానికి చంద్రబాబు ఎనలేని కృషి చేశారన్నారు. కేసీఆర్‌ను చంద్రబాబే తొలుత మంత్రిని చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని, 2009 ఎన్నికల్లో సిరిసిల్లలో కేటీఆర్ గెలవడానికి చంద్రబాబు చేసిన కృషిని మర్చిపోవద్దన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ను రూ.10 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్లకు పెంచిన ఘనత చంద్రబాబుదేనని, ఆయనను విమర్శిస్తే ఊరుకునేది లేదని 2009లో కేసీఆర్ అన్నారని పేర్కొన్నారు.

సమైక్యాంధ్రకు మద్దతు తెలిపిన ఒవైసీ, జగన్, పవన్‌ కల్యాణ్‌లు ఎలా మిత్రులయ్యారో చెప్పాలని రావుల డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజాస్వామ్యయుతంగా పోరాడతామన్నారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను చీల్చిన బీజేపీ ఆ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి పరోక్షంగా సహకరించిందని ఆరోపించారు.

More Telugu News