Andhra Pradesh: పెథాయ్ తుపాను దెబ్బకు ఆక్వా రైతు విలవిల.. దక్షిణ కోస్తాపై తీవ్ర ప్రభావం!

  • కృష్ణా జిల్లాలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
  • ఫ్యాన్లతో వేడిని పెంచుతున్న రైతులు
  • వాతావరణం మారకుంటే నష్టపోతామని ఆవేదన

ఆంధ్రప్రదేశ్ వైపు భీకరమైన పెథాయ్ తుపాను దూసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. పెథాయ్ తీరం దాటే సమయంలో తూర్పుగోదావరి జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. పెథాయ్ తుపాను ప్రభావంతో కోతకు వచ్చిన పంటలు దెబ్బతింటుండగా, తాజాగా కృష్ణా జిల్లాలో ఆక్వా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోవడంతో రొయ్యలు, చేపలు చనిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆందోళనకు లోనయిన రైతులు ఫ్యాన్ల ద్వారా నీటిని వేడిగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. వాతావరణం ఇలాగే చల్లబడితే రొయ్యలు మేత తినవనీ, దీంతో రోగాల బారిన పడి చనిపోతాయని రైతులు చెబుతున్నారు. ఈ వాతావరణం నాలుగు రోజులు కొనసాగినా తమకు తీవ్రమైన నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక ఎకరాలో పెట్టుబడిగా తాము రూ.8-9 లక్షలు పెట్టామనీ, ఇప్పుడు మొత్తం కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. ఈ ఫ్యాన్లను తిప్పడం ద్వారా నీళ్లు వేడి అవుతాయనీ, తద్వారా రోయ్యలకు, చేపలకు ఇన్ఫెక్షన్ రాదన్నారు. లేదంటే రొయ్యలు పైకి తేలకుండా నీటి లోపలే కుళ్లిపోతాయని వ్యాఖ్యానించారు. ఇలా జరిగిన తర్వాత తమ కుంటల్లోని ఆరోగ్యకరమైన రొయ్యలు, చేపలను కొనేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రారని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా సహా దక్షిణ కోస్తా జిల్లాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు.

More Telugu News