Andhra Pradesh: పెథాయ్ తుపాను ప్రభావం షూరూ.. కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులు!

  • బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను
  • రేపు కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరందాటే అవకాశం
  • సహాయక చర్యల కోసం పునరావాస కేంద్రాల ఏర్పాటు

బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుపాను క్రమంగా తీరం వైపు కదులుతోంది. ఈ తుపాను కాకినాడ-మచిలీపట్నం మధ్య రేపు తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అంచనాలు వేసిన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. ప్రస్తుతం ఈ తుపాను కాకినాడకు 670 కి.మీ.దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. కాగా, పెథాయ్ తుపాను తీరంవైపు దూసుకొస్తున్న తరుణంలో దాని ప్రభావం ప్రారంభమయింది.

ఇప్పటికే పెథాయ్‌ ప్రభావంతో తీర ప్రాంతంలో అలల ఉద్ధృతి, గాలుల తీవ్రత పెరిగాయి. కృష్ణా జిల్లాపై దీని ప్రభావం పడింది. బందరు, తీరప్రాంత మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. అలాగే జిల్లాలో అక్కడక్కడా చిరు జల్లులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. కాగా, తుపానును ఎదుర్కొనేందుకు వీలుగా అధికారులు తూర్పుగోదావరిలో 50 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు.

సహాయక చర్యల పర్యవేక్షణ కోసం 25 డ్రోన్ టీమ్ లను నియమించారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ అన్ని ఓడరేవుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను ఇప్పటికే అధికారులు జారీచేశారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. అత్యవసర సేవల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100 కు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు.

More Telugu News