fedhai: అనుభవాలను గుర్తుకు తెచ్చుకోండి...ఫెథాయ్‌ పట్ల అప్రమత్తంగా ఉండండి : సీఎం చంద్రబాబు

  • తుపాన్‌ ముంచుకు వస్తుండడంతో అధికారులతో సమీక్ష
  • ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోగలగాలని దిశానిర్దేశం
  • ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం

‘హుద్‌ హుద్‌, తిత్లీ తుపాన్‌ అనుభవాలను గుర్తుకు తెచ్చుకోండి, ఫెథాయ్‌ తుపాన్‌ కారణంగా ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి, అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోండి’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఫెథాయ్‌ కారణంగా కోస్తా తీరానికి తీవ్ర ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో శనివారం ఆయన ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. యంత్రాంగం అంతా సర్వసన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు.

ముందస్తు సన్నద్ధతపై ఆర్టీజీఎస్‌ నుంచి వివరాలు తెలుసుకున్నారు. తీవ్ర వాయుగుండం ఈ మధ్యాహ్నానికి తుపాన్‌గా మారే అవకాశం ఉందని అధికారులు వివరించడంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి అనిల్‌చంద్రపునేఠాకు సూచించారు. ప్రాణనష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 1100 కాల్‌ సెంటర్‌ నుంచి తుపాన్‌ జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా వారి పడవలను తీరంలోనే నిలిపివేయాలని ఆదేశించారు. తుపాన్‌ కారణంగా రాత్రిపూట కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచి ఉంచాలని అధికారులను ఆదేశించారు.

More Telugu News