Andhra Pradesh: ఆంధ్రా, తెలంగాణకు కొత్త తలనొప్పి.. ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచనున్న కర్ణాటక!

  • అసెంబ్లీలో ప్రకటించిన కుమారస్వామి సర్కారు
  • 524 మీటర్ల ఎత్తులో నిర్మిస్తామని ప్రకటన
  • జూరాల, సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు ఎదురుదెబ్బ

కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం మరోసారి తేనెతుట్టను కదిపింది. కృష్ణానదిపై నిర్మించిన ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 519.60 మీటర్లుగా ఉన్న ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 524.256 మీటర్లకు పెంచుతామని పేర్కొంది. ఇందుకోసం దాదాపు రూ.రూ.30,143 కోట్లు ఖర్చు అవుతాయని తెలిపింది. కర్ణాటక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు మంత్రి డీకే శివకుమార్ ఈ మేరకు జవాబిచ్చారు.

కర్ణాటక ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. కర్ణాటక ఒకవేళ ఆల్మట్టి ఎత్తును 524 మీటర్లకు పెంచితే తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుతోపాటు శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు వరదనీరు తగ్గనుంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కృష్ణా జలాలపై న్యాయ స్థానాల్లో పోరాడుతున్నాయి. తాజాగా కృష్ణా నదిపై ఆల్మట్టి ఎత్తును పెంచితే ఈ కష్టాలు మరింత తీవ్రం కానున్నాయి. గతంలో ఆల్మట్టి ఎత్తు పెంపుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

1969లో తొలిసారిగా ఏర్పాటైన బచావత్‌ ట్రైబ్యునల్‌ కృష్ణా నదిలో 2130 టీఎంసీల నీరు ఉన్నదని అంచనా వేసింది. ఈ నీటిని మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీ (తెలంగాణ, ఏపీ) వినియోగించుకోవాలని సూచించింది. అయితే ప్రస్తుతం కృష్ణాజలాల వివాదాలను విచారిస్తున్న బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ కృష్ణాలో నీటి లభ్యత 2578 టీఎంసీలుగా ఉందని తేల్చింది.

దీంతో పెరిగిన 448 టీఎంసీలను మూడు రాష్ట్రాలు పంచుకోవాలని సూచించింది. కర్ణాటక 177 టీఎంసీలు, మహారాష్ట్ర 81 టీఎంసీలు ఉమ్మడి ఏపీ 190 టీఎంసీలు అదనంగా వినియోగించుకోవచ్చని తెలిపింది. కాగా ఆల్మట్టి ప్రాజెక్టుకు ఇప్పటికే 129.72 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. తాజా పెంపును కలిపితే 306 టీఎంసీలను కర్ణాటక వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు కర్ణాటక ఆల్మట్టి ఎత్తును పెంచాలని కర్ణాటక భావిస్తోంది.

More Telugu News