KCR: కేసీఆర్ అరుదైన ఘనత.. ఆ ఐదుగురి సరసన టీఆర్ఎస్ చీఫ్

  • రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు
  •  చెన్నారెడ్డి, కోట్ల, ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ సరసన కేసీఆర్
  • అత్యధికంగా ఎన్టీఆర్ నాలుగుసార్లు

తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) అరుదైన ఘనత సాధించారు. రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన వారి జాబితాలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్ జూన్ 2, 2014న తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మరోమారు గెలిచిన కేసీఆర్ గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో రెండుసార్లు అంతకంటే ఎక్కువసార్లు సీఎంగా పనిచేసిన ముఖ్యమంత్రుల జాబితాలో చేరారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి మర్రి చెన్నారెడ్డి 6 మార్చి 1978లో సీఎంగా బాధ్యతలు చేపట్టి 11 అక్టోబరు 1980 వరకు పనిచేశారు. రెండోసారి 3 డిసెంబరు 1989 నుంచి 17 డిసెంబరు 1990 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరో కాంగ్రెస్ నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తొలిసారి 20 సెప్టెంబరు 1982 నుంచి 9 జనవరి 1983 వరకు సీఎంగా ఉన్న ఆయన రెండోసారి 9 అక్టోబరు 1992 నుంచి 12 డిసెంబరు 1994 వరకు సీఎంగా పనిచేశారు.

టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ఏకంగా నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తొలిసారి 9 జనవరి 1983 నుంచి 16 ఆగస్టు 1984 వరకు ఉన్నారు. రెండోసారి 16 సెప్టెంబరు 1984 నుంచి 9 మార్చి 1985 వరకు సీఎంగా ఉన్నారు. మూడోసారి 9 మార్చి 1985 నుంచి 2 డిసెంబరు 1989 వరు పనిచేశారు. నాలుగోసారి 12 డిసెంబరు 1994 నుంచి 1 సెప్టెంబరు 1995 వరకు సీఎంగా ఉన్నారు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తొలిసారి 1 సెప్టెంబరు 1995 నుంచి 14 మే 2004 వరకు వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.  ప్రస్తుతం మూడోసారి నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

ఇక కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 14 మే 2014 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పూర్తికాలంపాటు పదవిలో ఉన్నారు. ఆ తర్వాత రెండోసారి మే 2009 నుంచి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించే వరకు అంటే అదే ఏడాది సెప్టెంబరు రెండో తేదీ వరకు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు వీరి సరసన కేసీఆర్ చేరారు.

More Telugu News