kamalnath: సీనియర్‌కే జై.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్.. వీడిన సస్పెన్స్

  • మధ్యప్రదేశ్‌ సీఎంగా కమల్‌నాథ్
  • 72 ఏళ్ల వయసులో నెరవేరబోతున్న కల
  • జ్యోతిరాదిత్యకు నిరాశ
సస్పెన్స్ వీడిపోయింది. కాంగ్రెస్ అధిష్ఠానం సీనియర్‌కే ఓటేసింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సీనియర్ నేత కమల్‌నాథ్‌నే ఎంపిక చేసింది. ఫలితంగా సీఎం పీఠంపై కూర్చోవాలన్న 72 ఏళ్ల కమల్‌నాథ్ కల నెరవేరబోతోంది. భోపాల్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో కమల్‌నాథ్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి పదవి తనను వరిస్తుందని చివరి వరకు ఆశలు పెట్టుకున్న యువనేత జ్యోతిరాదిత్య సింధియా, పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

చింద్వారా నుంచి 9 సార్లు ఎంపీగా ఎన్నికైన కమల్‌నాథ్ రెండుసార్లు కేంద్రమంత్రిగా, ప్రొటెం స్పీకర్‌గా పనిచేశారు. అయితే, సీఎం కావాలన్న కల మాత్రం ఇప్పటి వరకు నెరవేరలేదు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఇన్నాళ్లకు ఆయన కల నెరవేరబోతోంది. నిజానికి యువనేత జ్యోతిరాదిత్య సింధియాను సీఎం చేయాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పట్టుబట్టినా, యూపీఏ చైర్ పర్సన్ సోనియా, ప్రియాంక వాద్రా మాత్రం కమల్‌నాథ్‌కే ఓటేశారు. దీంతో రాహుల్ తలొగ్గక తప్పలేదు.  
kamalnath
Congress
Madhya Pradesh
Rahul Gandhi
Sonia Gandhi

More Telugu News