Madhya Pradesh: జ్యోతిరాదిత్యకు నిరాశ... మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్ ఖరారు!

  • సీఎం ఎంపిక బాధ్యతలు రాహుల్ పై
  • ఏకగ్రీవ తీర్మానం చేసిన ఎమ్మెల్యేలు
  • కమల్ నాథ్ ను ఎంపిక చేసిన రాహుల్

మధ్యప్రదేశ్ కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తరువాత కాంగ్రెస్ పార్టీ, సీఎం బాధ్యతలను సీనియర్ నాయకుడు కమల్ నాథ్ కు అప్పగించాలని నిర్ణయించింది. మధ్యప్రదేశ్ లో యువనేత జ్యోతిరాదిత్య సింధియాకు అవకాశం వస్తుందని తొలుత భావించినా, బలమైన ప్రతిపక్షం ఉండటంతో, సీనియర్ నేత అయితేనే నెగ్గుకు రాగలరని రాహుల్ గాంధీ భావించినట్టు తెలుస్తోంది. నిన్న కేంద్ర పరిశీలకులు ఏకే ఆంటోనీ, జితేంద్ర సింగ్ సమక్షంలో సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీఎంను అధికారికంగా ప్రకటించే విషయాన్ని రాహుల్ గాంధీ భుజాలపై పెడుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ఆపై రాహుల్, పలువురు ముఖ్య నాయకులతో మాట్లాడి, కమల్ నాథ్ పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్ లో సాధారణ మెజారిటీకి కాంగ్రెస్ రెండు స్థానాల దూరంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమల్ నాథ్ తన చతురతను ఉపయోగించి, ఏడుగురు బీజేపీయేతర ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ కన్నా ఐదుగురు ఎమ్మెల్యేల అధిక బలాన్ని కాంగ్రెస్ సంపాదించుకున్నట్లయింది. బహుజన సమాజ్ పార్టీ కూడా కాంగ్రెస్ కు మద్దతు పలికింది.

More Telugu News