Greater Hyderabad: గ్రేటర్ పరిధిలో 481 మంది అభ్యర్థుల డిపాజిట్ గల్లంతు

  • గ్రేటర్ పరిధిలో బరిలో 555 మంది అభ్యర్థులు
  • 531 మంది ఓటమి
  • డిపాజిట్ కోల్పోయిన వారిలో ముఖ్య పార్టీల నేతలు కూడా

తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ ప్రభంజనంలో పలువురు అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇందులో పలువురు ప్రముఖులు కూడా ఉండడం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో మొత్తం 555 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 531 మంది పరాజయం పాలవగా 481 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఫలితంగా నామినేషన్ సందర్భంగా చెల్లించిన రూ. 10 వేలు (ఎస్టీ, ఎస్టీలకు రూ. 5 వేలు) అభ్యర్థులు కోల్పోయినట్టే. డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థులకు ఈ సొమ్మును అధికారులు తిరిగి చెల్లించరు.

నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లలో ‘నోటా’కు పోను మిగిలిన ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లు పోలైన అభ్యర్థులకు డిపాజిట్లు దక్కినట్టు. ఆరు శాతం కంటే తక్కువ ఓట్లు పోలైన అభ్యర్థిని డిపాజిట్ కోల్పోయినట్టు పరిగణిస్తారు. మల్కాజిగిరిలో టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు  87,990 ఓట్లతో గెలుపొందారు. ఇక్కడ పోటీలో ఉన్న బీజేపీ, టీజేఎస్ అభ్యర్థులు డిపాజిట్లు దక్కించుకోగా ఏకంగా 39 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.

ఉప్పల్‌లో బీజేపీ అభ్యర్థి ఎన్‌వీఎస్ ప్రభాకర్, శేరిలింగంపల్లిలో బీజేపీ అభ్యర్థి యోగానంద్, కూకట్‌పల్లిలో మాధవరం కాంతారావు, ఖైరతాబాద్‌‌లో టీఆర్‌ఎస్‌ రెబల్‌ మన్నెం గోవర్థన్‌రెడ్డి, రాజేంద్రనగర్‌లో బద్ధం బాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రెబెల్‌ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి, అంబర్‌పేటలో టీజేఎస్‌ అభ్యర్థి నిజ్జెన రమేష్‌ తదితరులు డిపాజిట్లు కోల్పోయారు.

More Telugu News