Surjit Bhalla: మోదీకి షాక్ మీద షాక్‌.. ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యత్వానికి సుర్జీత్ భల్లా రాజీనామా

  • ప్రధానికి దూరమవుతున్న ఆర్థికవేత్తలు
  • ఒక్కొక్కరుగా రాజీనామా
  • ప్రభుత్వ ఒత్తిళ్లే కారణమంటున్న ప్రతిపక్షాలు

ప్రధాని ఆర్థిక సలహా మండలి పార్ట్ టైమ్ సభ్యత్వానికి ప్రముఖ ఆర్థికవేత్త, వ్యాసకర్త సుర్జీత్ భల్లా రాజీనామా చేశారు. ఈనెల 1నే రాజీనామా చేసిన ఆయన మంగళవారం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. భల్లా రాజీనామాను ప్రధాని కార్యాలయం ఆమోదించింది. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేసిన మరునాడే సుర్జీత్ భల్లా రాజీనామా విషయం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. అలాగే, ప్రధాన ఆర్థిక సలహాదారు పదవికి అరవింద్ సుబ్రమణియన్ రాజీనామా చేశారు.

నీతి ఆయోగ్ చైర్మన్ పదవి నుంచి అరవింద్ పనగడియా తప్పుకున్నారు. ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు తప్పుకుంటుండడం మోదీకి షాకేనని చెబుతున్నారు. వీరిలో ఏ ఒక్కరు కూడా పూర్తికాలం పనిచేయలేదు. ప్రభుత్వ ఒత్తిళ్ల కారణంగా వీరంతా తమ పదవులకు రాజీనామా చేసి బయటకు వస్తున్నట్టు చెబుతున్నారు. మోదీ ప్రభుత్వానికి సేవలందిస్తున్న ఆర్థికవేత్తలు ఒక్కొక్కరుగా దూరమవుతుండడం చర్చనీయాంశమైంది. తమ పనిని తాము చేసుకోనివ్వకుండా ఒత్తిళ్లకు గురిచేస్తుండడం వల్లే వారంతా తప్పుకుంటున్నారని కాంగ్రెస్ విమర్శించింది

More Telugu News