తెలంగాణ ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగింది.. మేం ఈసీకి ఫిర్యాదు చేస్తాం!: ఉత్తమ్ కుమార్ రెడ్డి

11-12-2018 Tue 12:55
  • మేం ఓడిపోతామని టీఆర్ఎస్ నేతలు చెప్పారు
  • కౌంటింగ్ కు ముందే వాళ్లకు ఎలా తెలిసింది
  • దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ట్యాంపరింగ్ చోటుచేసుకుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కౌంటింగ్ పూర్తికాకముందే తాము గెలుస్తామని టీఆర్ఎస్ నేతలు ప్రకటించుకోవడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోతుందని టీఆర్ఎస్ నేతలు ముందుగానే చెప్పారనీ, ఈ వ్యవహారంలో తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ లో ఈ రోజు మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు.

ఈ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేతలందరూ ఆర్వో అధికారులకు ఫిర్యాదు చేయాలని ఉత్తమ్ సూచించారు. తాను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఈ విషయమై ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ నేతలు ట్యాంపరింగ్ కు పాల్పడ్డారనీ, అందుకే ఫలితాల వెల్లడి ఆలస్యమయిందని పునరుద్ఘాటించారు.