Cricket: ‘మిమ్మల్ని జట్టులోకి తీసుకోలేను’ అని నాతో పాటు స‌చిన్‌, సెహ్వాగ్‌ల ముఖం మీదే ధోని చెప్పేశాడు!: గంభీర్‌

  • యువ‌త కోసం త్యాగాలు చేయాల‌న్నాడు
  • రొటేష‌న్ ప‌ద్ధ‌తిలో ఆడిస్తాన‌ని చెప్పాడు
  • మేమంతా ఆ వ్యాఖ్య‌ల‌తో షాక్ కు గుర‌య్యాం

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ఓపెన‌ర్, ఇటీవ‌ల రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ఆట‌గాడు గౌత‌మ్ గంభీర్ మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని వ్య‌వ‌హార‌శైలిపై తీవ్రంగా మండిప‌డ్డాడు. 2012లో ఆస్ట్రేలియా-భార‌త్‌-శ్రీలంక జ‌ట్ల‌ మధ్య ఆస్ట్రేలియాలో జ‌రిగిన కామ‌న్ వెల్త్ బ్యాంక్‌ సిరీస్ లో త‌న‌ను ఆడించ‌బోన‌ని ధోని ముఖం మీదే చెప్పేశాడ‌ని గంభీర్ గుర్తుచేసుకున్నాడు. త‌న‌తో పాటు స‌చిన్ టెండూల్క‌ర్‌, వీరేంద్ర సెహ్వాగ్ లను జ‌ట్టు తీసుకుంటే ఆస్ట్రేలియాకు 20 ప‌రుగులు అద‌నంగా ల‌భిస్తాయ‌ని ధోని చెప్పాడ‌న్నారు. ఓ జాతీయ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో గంభీర్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు.

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ధోని.. స‌చిన్‌, సెహ్వాగ్‌తో పాటు త‌న‌ను ఒకేసారి ఆడించ‌లేన‌ని స్ప‌ష్టం చేశాడ‌న్నారు. 2015 ప్ర‌పంచ‌క‌ప్ ల‌క్ష్యంగా యువ జ‌ట్టును సిద్ధం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌నీ, సీనియ‌ర్లు త్యాగాలు చేయ‌క‌త‌ప్ప‌ద‌ని వ్యాఖ్యానించాడ‌న్నారు. స‌చిన్‌, సెహ్వాగ్‌లతో పాటు త‌న‌ను రొటేష‌న్ ప‌ద్ధ‌తిలో మాత్ర‌మే ఆడిస్తాన‌ని ధోని చెప్పాడ‌న్నారు.

ఆ సిరీస్ లో విరాట్ కోహ్లీ త‌ర్వాత తానే అత్యధిక స్కోర‌ర్ గా నిలిచాన‌నీ, ఏడు మ్యాచుల్లో 308 ప‌రుగులు చేశాన‌ని గంభీర్ గుర్తు చేసుకున్నాడు. ఫామ్ లో ఉండి కుదురుగా ఆడుతున్నంత‌వ‌ర‌కూ వ‌య‌సు అన్న‌ది స‌మ‌స్యే కాద‌ని తాను భావించేవాడిన‌ని తెలిపాడు. త‌న‌తో చెప్పిన‌ట్లే స‌చిన్‌, సెహ్వాగ్ లతోనూ ధోని మాట్లాడిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ మాట‌లు విన్న తామంతా ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యామ‌న్నారు.

జ‌ట్టు కెప్టెన్‌గా ఓ నిర్ణ‌యం తీసుకుంటే దానికి క‌ట్టుబ‌డి ఉండాల‌నీ, కానీ ధోని మాత్రం కామ‌న్ వెల్త్ బ్యాంక్ సిరీస్ లో జ‌ట్టు విఫ‌లం కావ‌డంతో త‌మ ముగ్గురిని (స‌చిన్‌-సెహ్వాగ్‌-గంభీర్‌) ఒకే జ‌ట్టులో ఆడించాడ‌ని గుర్తుచేసుకున్నాడు. కామన్ వెల్త్ సిరీస్ లో శ్రీలంక‌పై ఆస్ట్రేలియా జ‌ట్టు 2-1 తేడాతో విజ‌యం సాధించి క‌ప్‌ను అందుకుంది. భార‌త్ ముందుగానే టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌, 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యాల్లో గంభీర్ కీల‌క‌పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే

More Telugu News