Uttar Pradesh: బులంద్‌షహర్ ఘటనలో సంచలన విషయం వెలుగులోకి!

  • సుబోధ్ కుమార్‌ను చంపింది ఆర్మీ జవానా?
  • అనుమానించేలా ఉన్న వీడియోలు
  • నిందితుడి కోసం జమ్ముకశ్మీర్‌కు రెండు పోలీసు బృందాలు

బులంద్‌షహర్‌లో గోరక్షకుల దాడిలో మృతి చెందిన సీఐ సుబోధ్ కుమార్ సింగ్  వ్యవహారంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అల్లర్లను అదుపు చేసేందుకు తన బృందంతో కలిసి వెళ్లిన సుబోధ్‌ కుమార్‌పై గో రక్షకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆయనను తుపాకితో కాల్చి చంపారు. సుబోధ్ కుమార్‌పై కాల్పులు జరిపిన యోగేశ్ రాజ్ అనే వ్యక్తిని అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే, గత రెండు మూడు రోజులుగా వెలుగులోకి వస్తున్న అల్లర్లకు సంబంధించిన వీడియోలను పరిశీలించిన పోలీసులు సుబోధ్‌ను కాల్చింది యోగేశ్ రాజ్ కాదని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చారు.

జమ్ముకశ్మీర్‌కు చెందిన ఆర్మీ జవాను జీతూ ఫ్యూజీ సీఐ సుబోధ్‌పై కాల్పులు జరిపినట్టు అనుమానిస్తున్నారు. వెలుగులోకి వచ్చిన వీడియోలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. ఘటన జరిగిన అనంతరం ఆయన తిరిగి జమ్ముకశ్మీర్ వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. దీంతో అతడిని అదుపులోకి తీసుకునేందుకు రెండు పోలీసులు బృందాలు అక్కడికి బయలుదేరి వెళ్లాయి.

పోలీసు కాల్పుల్లో సుమిత్ అనే యువకుడు మృతి చెందిన తర్వాత ఆందోళనకారులు ఒక్కసారిగా హింసకు పాల్పడ్డారు.  పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసుల నుంచి తుపాకులు లాక్కుని చంపాలంటూ కొందరు అరుస్తూ పోలీసులవైపు రావడం వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వెంటనే సుబోధ్‌పై ఎవరో ఆయుధంతో దాడి చేసి తలపై కాల్చారు. ఆ సమయంలో జీతు అక్కడే ఉండడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు సిద్ధమయ్యారు.

More Telugu News