rationcard: రేషన్‌ కార్డు పొందడం ఇక ఈజీ... ఏపీ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు జారీ!

  • 1100 నంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు అందిస్తే చాలు
  • అభ్యర్థి ఫోన్‌ నంబర్‌కు దరఖాస్తు వివరాలు వస్తాయి
  • క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం అర్హులకు కార్డుల జారీ

రేషన్‌ కార్డు కావాలనుకుంటున్నారా...స్థానిక నాయకుడి సిఫార్సు కోసం పాకులాడక్కర్లేదు...మధ్య వర్తిని సంతృప్తి పరచాల్సిన పనిలేదు ...కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేదు...ఒక్క ఫోన్‌ కాల్‌ చాలు మీ ఇంటికే రేషన్‌ కార్డు వస్తుందంటోంది ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌. రేషన్‌ కార్డు జారీకి రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. ఫోన్‌ కాల్‌తో రేషన్‌ కార్డు పొందే సౌకర్యాన్ని కల్పించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండీ సూర్యకుమారి వివరాలను వెల్లడించారు.

ప్రజాసాధికార సర్వేలో పేర్లు నమోదు చేసుకున్న వారు రేషన్‌ కార్డు కోరుకుంటే 1100 నంబర్‌కు ఫోన్‌చేసి వివరాలివ్వాలి. కాసేపటికి వ్యక్తి మొబైల్‌ నంబర్‌కి దరఖాస్తు సమాచారం వస్తుంది. అవే వివరాలు సంబంధిత అధికారి వద్దకు వెళ్తాయి. క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం దరఖాస్తుదారుడు అర్హుడని తేలితే రేషన్‌ కార్డు మంజూరు చేసి సంబంధిత జిల్లా అధికారులకు, అక్కడి నుంచి మండలాలకు పంపిస్తారు. గడచిన నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో 23 లక్షల 59 వేల 391 మంది కొత్త వారికి రేషన్‌ కార్డులు ఇచ్చామని, డీలర్ల పనితీరుపై 81 శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సూర్యకుమారి తెలిపారు.

More Telugu News