Dalit outfit: హనుమంతుడు దళితుడన్న యోగి వ్యాఖ్యల ఎఫెక్ట్.. పూజారిని బయటకు లాగేసిన దళిత నేతలు

  • పూజారిని కొట్టి, ఆలయం నుంచి బయటకు లాక్కొచ్చిన దళిత సంఘాలు
  • కేసు నమోదు చేసిన పోలీసులు
  • ఆలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు

హనుమంతుడు దళితుడంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యల పర్యవసానం ఇప్పుడు ఆ రాష్ట్రంలో కనిపిస్తోంది. హనుమంతుడు దళితుడని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పడంతో ఇటీవల రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసిన దళితులు.. రాష్ట్రంలోని హనుమాన్ ఆలయాల నిర్వహణ వారికి అప్పగించాలని, గుడిలోకి దళితులను తప్ప ఇతరులను అనుమతించవద్దని డిమాండ్ చేశారు.

తాజాగా, ముజఫర్‌నగర్‌లోని హనుమంతుడి ఆలయంలోకి ప్రవేశించిన వాల్మీకి క్రాంతిదళ్ సభ్యులు ఆలయ పూజారిపై చేయి చేసుకున్నారు. అనంతరం ఆయనను బయటకు గెంటేశారు. ఆయన నేరుగా కొత్వాలి సిటీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హనుమాన్ ఆలయానికి చేరుకుని మోహరించారు.

ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్రీయ బ్రాహ్మిణ్ మహాసంఘ్, రాష్ట్రీయ పరశురామ్ సేన (బ్రహ్మవాహిణి) సభ్యులు పోలీసు అధికారులను కలిసి జిల్లా వ్యాప్తంగా ఉన్న 500 ఆలయాలకు భద్రత కల్పించాలని కోరారు.

More Telugu News