Andhra Pradesh: జగన్ ప్రజాసంకల్ప యాత్రపై తేనెటీగల దాడి.. తప్పించుకునేందుకు పరుగులు తీసిన నేతలు!

  • శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న జగన్
  • నేటికి 3,390 కిలోమీటర్లు పాదయాత్ర
  • జగన్ క్షేమంగానే ఉన్నారన్న వైసీపీ శ్రేణులు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. 314వ రోజు యాత్రలో భాగంగా జగన్ పొందూరు మండలం నరసాపురం వద్ద పాదయాత్ర సాగుతోంది. ఈ నేపథ్యంలో పాదయాత్రలో పాల్గొంటున్న ప్రజలపై ఒక్కసారిగా తేనెటీగలు విరుచుకుపడ్డాయి. దీంతో తేనెటీగల నుంచి తప్పించుకునేందుకు నేతలు, కార్యకర్తలు పరుగులు తీశారు. కాగా, ఈ ఘటనలో జగన్ క్షేమంగానే ఉన్నారని వైపీసీ శ్రేణులు తెలిపాయి.

ఈరోజు ఉదయం రెడ్డి పేట నుంచి మొదలైన ప్రజాసంకల్ప యాత్ర లోలుగు, నందివాడ క్రాస్‌, నర్సాపురం అగ్రహారం, కేశవదాసుపురం క్రాస్‌, చిలకలపాలెం మీదుగా ఎచ్చెర్ల వరకూ సాగనుంది. చిలకల పాలెంలో ఈ రోజు సాయంత్రం జరిగే బహిరంగ సభలో జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పాదయాత్రలో భాగంగా జగన్ ఇప్పటివరకూ 3,390.3 కిలోమీటర్లు నడిచారు.

More Telugu News