Telangana: శేరిలింగంపల్లిలో అర్ధరాత్రి నగదు పంపిణీ.. మహాకూటమి నేతలను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు!

  • కొట్టుకున్న టీఆర్ఎస్, మహాకూటమి కార్యకర్తలు
  • ఆందోళనకారుల్ని చెదరగొట్టిన పోలీసులు
  • సంగారెడ్డిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ

తెలంగాణ ఎన్నికలకు మరో రోజు మాత్రమే మిగిలి ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ ప్రలోభాలకు తెరతీశాయి. ఇందులో భాగంగా అర్ధరాత్రి నగదు పంపకానికి దిగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారు శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డి కాలనీలో నిన్న అర్ధరాత్రి సమయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహాకూటమి అభ్యర్థులు నగదును పంచుతున్నారని ఆరోపిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

దీంతో మహాకూటమి అభ్యర్థికి మద్దతుగా టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు రంగంలోకి దిగడంతో ఇరువర్గాలు పరస్పరం దాడిచేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా జోగిపేటలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్‌ తమ్ముడు రాహుల్ కిరణ్ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు పంచుతున్నాడంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు సమాచారం అందించారు.

అధికారులు త్వరగా రాకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలే వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాలు ముష్టిఘాతాలు కురిపించుకున్నాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారనీ, వారిని పట్టించుకోకుండా తమను వేధిస్తున్నారని నిరసన తెలుపుతూ రోడ్డుపై బైఠాయించారు. సంగారెడ్డి డీఎస్పీ ఘటనా స్థలికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.

More Telugu News