Telangana: తెలంగాణ ఏర్పాటు చేయాలని చెప్పిందే నేను: గులాంనబీ ఆజాద్

  • అమరుల త్యాగాలను, విద్యార్థుల పోరాటాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లా
  • కేసీఆర్ 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నారు
  • తెలంగాణ ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర లేదు

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అధిష్ఠానానికి తొలుత చెప్పిందే తానని కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వికారాబాద్ జిల్లా తండూరు, పరిగి, నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్, వనపర్తి జిల్లా కొత్తకోటలో బుధవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా తాను ఉన్న సమయంలోనే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు.

అమరుల త్యాగాన్ని, విద్యార్థుల పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. సోనియాగాంధీ దయ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర ఏమాత్రం లేదన్నారు. రేవంత్ రెడ్డి పేరు చెబితేనే కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోందని, ఈ ఎన్నికల్లో ఆయన  40 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం ఖాయమని ఆజాద్ జోస్యం చెప్పారు.

More Telugu News