prajakutami: తెలంగాణ ఎజెండా అమలు చేసే బాధ్యత మాది: ప్రొఫెసర్ కోదండరామ్

  • రాష్ట్రం అభివృద్ధి కోసం నిలబడతాం
  • ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తితో పని చేస్తాం
  • నిరంకుశ పాలనకు ఈ నెల 7తో చరమగీతం పాడాలి

తెలంగాణ ఎజెండా అమలు చేసే బాధ్యత తమదని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణా హోటల్ లో ప్రజా కూటమి నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం కోసం కొట్లాడిన తాము అభివృద్ధి కోసం కూడా అదేవిధంగా నిలబడతామని, ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తితో పని చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం తన కోసమే ఏర్పడిందని కేసీఆర్ భావిస్తున్నారని, టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు ఈ నెల 7తో చరమగీతం పాడాలని కోరారు.

కేసీఆర్ నియంతృత్వం నుంచి స్వేచ్ఛ కలిగిస్తాం: సురవరం

కేసీఆర్ సర్కార్ ప్రజాస్వామ్యం, పౌరహక్కులను కాలరాసిందని ప్రజా కూటమి నేత, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. నియంతృత్వానికి వ్యతిరేకంగానే కూటమి కట్టామని, ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రజాస్వామిక హక్కు కూటమి కల్పిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా కేసీఆర్ పాలన చేశారని, ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపిస్తే కేసీఆర్ నియంతృత్వం నుంచి స్వేచ్ఛ కలిగిస్తామని అన్నారు.

నాలుగు కోట్ల ప్రజల ఫ్రంటే ప్రజాకూటమి

తెలంగాణలో ప్రజాఫ్రంట్ ను గెలిపిద్దామని ప్రజా గాయకుడు గద్దర్ పిలుపు నిచ్చారు. నాలుగు కోట్ల ప్రజల ఫ్రంటే ప్రజాకూటమి అని, బీజేపీతో కలిసిన కేసీఆర్ రహస్య కూటమిని ఓడిద్దామని అన్నారు.

More Telugu News