kodada: కోదాడ సభలో చంద్రబాబు ఏం మాట్లాడాడు.. హరీష్ రావు పటపటా పళ్లు కొరకాలి: కేసీఆర్

  • కృష్ణానదిలో నీళ్లు లేవని చంద్రబాబు అంటున్నాడు
  • గోదావరి నీళ్లు పంచుకుందామంటున్నాడు
  • మన కాంగ్రెస్ దద్దమ్మలు తలకాయలూపుతున్నారు

కోదాడ సభలో చంద్రబాబు ఏం మాట్లాడాడు, కృష్ణానదిలో నీళ్లు లేవు, గోదావరి నీళ్లు పంచుకుందామని అంటున్నాడని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. గజ్వేల్ నిర్వహించిన టీఆర్ఎస్ సభలో ఆయన మాట్లాడుతూ, ‘చంద్రబాబు, రాహుల్.. పక్కన మన దద్దమ్మలు, మొద్దన్నలు కూర్చున్నారు. కృష్ణానదిలో నీళ్లు లేవు, గోదావరి నీళ్లు పంచుకుందామని తెలంగాణ కాంగ్రెస్ సన్నాసులను కూర్చోబెట్టి.. వాళ్ల అధినేత రాహుల్ గాంధీకి ఎండార్స్ చేస్తున్నాడు చంద్రబాబునాయుడు! కృష్ణా నదిలో నీళ్లు లేవంటే, మన కాంగ్రెస్ గొర్రెలు తలకాయలు ఊపుతున్నాయి. కృష్ణా నదిలో నీళ్లు లేవా? మన వాటా లేదా? హరీష్ రావు పటపట పళ్లు కొరకాలి. ‘బిడ్డా, మా వాటా లేదా?’ అంటూ యావత్తు తెలంగాణ ఓటుతో సమాధానం చెప్పాలి.

మా గడ్డ మీద నిలబడి, కృష్ణలో నీళ్లు లేవు.. గోదావరి నీళ్లు పంచుకుందామని మాయమాటలు మాట్లాడుతున్నాడు. ఎంత ధైర్యం? అసలు, చంద్రబాబునాయుడుకి ఏం కావాలి? మనకు 119 ఉన్నాయి గానీ, ఆయనకు 175 నియోజకవర్గాలు ఉన్నాయి. మన కంటే ఆయన రాష్ట్రం పెద్దగా ఉంది. తెలంగాణలో ఆయన నడిపే కీలుబొమ్మ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాడు. చంద్రబాబుకు ఎవడున్నా మంచిదే, ఒక్క కేసీఆర్ ఉండొద్దు. కేసీఆర్ ప్రాణం పోయినా హక్కులు కోల్పోనీయడు కదా! ఇక్కడ ఈయన ఆటలు సాగవు కదా! దద్దమ్మలు, మొద్దన్నలు ఉంటే గోల్ మాల్ చేయొచ్చు కదా! వేల కోట్ల రూపాయలను, ఆయన నాయకులను, ఇంటెలిజెన్స్ ను తెచ్చి ఇక్కడ మోహరించాడు చంద్రబాబునాయుడు. మనమంతా అమాయకులమని, గోల్ మాల్ చేయొచ్చని, డబ్బులిచ్చి కొనుక్కోవచ్చని చంద్రబాబునాయుడు విర్రవీగుతున్నాడు. దానికి మన దద్దమ్మగాళ్లు భజన చేస్తున్నారు’ అని మండిపడ్డారు. 

More Telugu News