Telangana: తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ కొంప ముంచే అంశాలు ఇవే.. ప్రకటించిన లగడపాటి రాజగోపాల్!

  • వరంగల్ లో కాంగ్రెస్ జెండా ఎగరబోతోంది
  • ఆదివాసీలు, ఎస్సీలు వ్యతిరేకంగా మారారు
  • డబుల్ బెడ్రూమ్ ప్రభావం పట్టణాల్లో తీవ్రంగా ఉంది

తెలంగాణలో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించనుందని పార్లమెంటు మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ బాంబు పేల్చారు. ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకే తొలుత ఆధిక్యం వస్తుందని తేలినప్పటికీ, క్రమంగా పరిస్థితి మారిపోయిందని తెలిపారు. ఆర్జీ ఫ్లాష్ టీమ్ నిన్న చేసిన సర్వేను ఈరోజు ఉదయాన్నే తనకు పంపిందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రతిపక్షాలు బలహీనంగా ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత కనిపించదనీ, అదే ప్రతిపక్షాలు ఏకమైతే ప్రభుత్వంతో పాటు స్థానిక ఎమ్మెల్యే గుణగణాలు, చేపట్టిన అభివృద్ధి పనులు, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చర్చకు వస్తాయన్నారు. ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు, కోదండరాం, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతలు ఏకం కావడంతో అదే పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. దళితులకు మూడెకరాల భూమిని ఇవ్వలేదన్న విషయంలో ఆ సామాజిక వర్గం ఏకమయిందనీ, టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందని తెలిపారు.

అలాగే ఆదివాసీలకు(ఎస్టీ) 12 శాతం రిజర్వేషన్ హామీ నిలబెట్టుకోకపోవడంతో వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలలో ఎస్టీ సామాజికవర్గం మొత్తం మహాకూటమి వైపు మొగ్గు చూపుతోందని వెల్లడించారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వకపోవడంతో పట్టణాల్లో టీఆర్ఎస్ కు తీవ్రమైన వ్యతిరేకత వస్తోందన్నారు.

దీనికి తోడు డబుల్ బెడ్రూమ్ దక్కని ప్రజలకు అధికారంలోకి రాగానే రూ.50 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో పరిస్థితి ఇంకా దిగజారిందని వ్యాఖ్యానించారు. ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ హామీని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకత్వంలోని మహాకూటమి ఇచ్చిన హామీలు ప్రజలపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయని వెల్లడించారు. ముస్లింలు రిజర్వేషన్ విషయంలో క్రమంగా టీఆర్ఎస్ కు దూరం జరుగుతున్నారని బాంబు పేల్చారు.

  • Loading...

More Telugu News