Subodh kumar singh: సీఐని రక్షిద్దామనే అనుకున్నా.. కానీ నా ప్రాణాలు కాపాడుకునేందుకు ఆయనను వదిలేసి పరుగులు పెట్టా: సుబోధ్ కారు డ్రైవర్

  • స్పృహ కోల్పోయిన ఆయనను జీపులోకి ఎక్కించాను
  • అది చూసి రాళ్లతో మాపై దాడి చేశారు
  • ప్రాణాలు కాపాడుకునేందుకు జీపు దిగి పరిగెత్తా

గోరక్షకుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఉత్తరప్రదేశ్ సీఐ సుబోధ్ కుమార్‌ను రక్షించేందుకు చాలా ప్రయత్నించానని అయితే, తన ప్రాణాలను కాపాడుకునేందుకు మరో దారి లేక ఆయనను వదిలి వేసి పరిగెత్తాల్సి వచ్చిందని ఆయన కారు డ్రైవర్ రామ్ ఆశ్రయ్ తెలిపాడు.

‘‘మా బాస్ ప్రహరీ వద్ద స్పృహ తప్పి పడి ఉన్నారు. వెంటనే ఆయన వద్దకెళ్లి అతి కష్టంపై పైకి లేపి జీపులోకి ఎక్కించాను. వాహనాన్ని స్టార్ట్ చేస్తుండగా దుండగుల గుంపు మాపై రాళ్లు రువ్వడం ప్రారంభించింది. ఆ కాసేపటికే కాల్పులు జరిపారు. దీంతో నా ప్రాణాలను కాపాడుకునేందుకు జీపును అక్కడే వదిలి పరుగులు తీశా’’ అని మీడియాకు తెలిపాడు. కాల్చిన వారు చెరుకు తోటలో దాక్కున్నారని చెప్పాడు.

సీఐ సుబోధ్ కుమార్ బుల్లెట్ గాయంతోనే మృతి చెందినట్టు పోలీసులు తేల్చారు. ఎక్స్‌రేలో ఈ విషయం బయటపడిందన్నారు. బులంద్‌షహర్ హింసపై దర్యాప్తు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

అనుమతి లేని కబేళాల్లో గోవధ జరుగుతోందంటూ సోమవారం బులంద్‌షహర్‌లో వదంతులు వ్యాపించాయి. పట్టణానికి సమీపంలోని మహా అనే గ్రామ శివారులోని అడవిలో గోవులను చంపిన ఆనవాళ్లు కనిపించాయని పుకార్లు షికారు చేశాయి. దీంతో సమీప గ్రామాల్లోని హిందూ గ్రూపులు, గోరక్షక దళాలు ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చాయి.

అడవిలో కనిపించిన గోవుల కళేబరాలను ట్రాక్టర్లలో వేసుకుని పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆందోళనకు దిగారు. వాహనాలను దగ్ధం చేసి హింసకు పాల్పడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు సుబోధ్ కుమార్ తన అనుచరులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులపై రాళ్లతో దాడి చేసిన ఆందోళనకారులు సుబోధ్‌ను కాల్చి చంపారు.

More Telugu News