cricket: ఇక క్రికెట్ నుంచి తప్పుకుంటా: గౌతమ్ గంభీర్

  • అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ కానున్నా
  • నేను ఔటైనప్పుడు విన్న కామెంట్లు కలచివేశాయి
  • అందుకే, ఈ నిర్ణయం తీసుకున్నా

టీమిండియా సీనియర్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ కానున్నట్టు ప్రకటించాడు. తన రిటైర్మెంట్ విషయాన్ని ఓ వీడియో పోస్ట్ ద్వారా వెల్లడించాడు. క్రికెట్ లో గత పదిహేనేళ్ల నుంచి దేశానికి సేవలందించానని, ఇక క్రికెట్ కు వీడ్కోలు పలకనున్నానని చెప్పాడు.

కొంతకాలంగా తన ప్రదర్శనని చాలా మంది అవహేళన చేశారని, తాను ఔటై డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్తున్నప్పుడల్లా విన్న కామెంట్లు తన మనసును కలిచివేశాయని ఆ వీడియోలో బాధపడ్డాడు. పరోక్షంగా ఆ అవమానాలు భరించలేకే తన రిటైర్మెంట్ పై నిర్ణయం తీసుకున్నానని అన్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్ లో సాధించిన ఘనతలను గంభీర్ ఈ వీడియో ద్వారా గుర్తుచేసుకున్నాడు. ఇంతకాలం తనను ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన గంభీర్, కోల్ కతా అభిమానులకు ప్రత్యేకంగా తన కృతఙ్ఞతలు తెలిపాడు.

కాగా, ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో ఢిల్లీ-ఆంధ్రా జట్ల మధ్య గురువారం జరిగే మ్యాచే గంభీర్ కు చివరి మ్యాచ్ అని తెలుస్తోంది. 2003 ఏప్రిల్ 14న టీమ్ ఇండియాలో గంభీర్ ప్రవేశించాడు. గంభీర్ తన పదిహేనేళ్ల క్రికెట్ కెరీర్ లో 58 టెస్టులు,147 వన్డేలు, 37 టీ20లు ఆడాడు.

More Telugu News