Chandrababu: రాబోయే ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించబోతున్నాం: ధర్మాన ప్రసాదరావు

  • ఏపీలో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుంది
  • రాజ్యాంగం కూలిపోయేలా చేసింది చంద్రబాబే
  • జగన్ పాదయాత్ర జనవరి రెండో వారంలో ముగుస్తుంది
ఏపీలో వైసీపీ బలమైన పార్టీగా అవతరించిందని... అందుకే తమ పార్టీ తరపున పోటీ చేయాలని చాలా మంది నేతలు ఆశిస్తున్నారని ఆ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించబోతున్నామని చెప్పారు. ఏపీలో చంద్రబాబు పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే రాష్ట్రం ప్రమాదకర స్థితిలో పడిందని చెప్పారు. సీబీఐ వంటి సంస్థలను ఏపీలోకి రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శించారు. ఇక్కడి డబ్బును తీసుకెళ్లి తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును తరిమికొట్టేందుకు తమతో ఎవరు కలసి వచ్చినా స్వాగతిస్తామని చెప్పారు.

జగన్ పాదయాత్ర జనవరి రెండో వారంలో ముగుస్తుందని ధర్మాన తెలిపారు. చంద్రబాబు సభలకు జన సమీకరణ చేస్తున్నా జనాలు రావడం లేదని... జగన్ సభలకు వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని అన్నారు. రాజ్యాంగం కూలిపోయిందని దేశమంతా తిరుగుతూ చంద్రబాబు చెబుతున్నారని... రాజ్యాంగం కూలిపోయేలా చేసిన వ్యక్తి చంద్రబాబేనని విమర్శించారు. 
Chandrababu
Dharmana Prasad
jagan
YSRCP
Telugudesam

More Telugu News