bihar: బిహార్ పోలీసుల ఇంగ్లిష్ పాండిత్యం.. కోర్టు ఉత్తర్వులు అర్థం కాక అమాయకుడికి జైలుశిక్ష!

  • విడాకుల కోసం కోర్టుకు వెళ్లిన నీరజ్
  • ఆస్తుల వివరాలు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశం
  • ఉత్తర్వులు అర్థం చేసుకోలేక జైలులో పెట్టిన అధికారులు

కోర్టు ఉత్తర్వులు ఇంగ్లిష్ లో ఉండటంతో అర్థం చేసుకోలేకపోయిన పోలీసులు, ఓ అమాయకుడిని విడిచిపెట్టడానికి బదులుగా జైలులో పెట్టారు. బిహార్ రాజధాని పట్నాలో గత నెల 25న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జెహానాబాద్ కు చెందిన వ్యాపారి నీరజ్ కుమార్ కొన్నేళ్ల క్రితం విడాకుల కోసం కోర్టులో కేసు దాఖలు చేశాడు. ఈ సందర్భంగా కేసును విచారించిన స్థానిక కోర్టు.. నీరజ్ కు సంబంధించిన ఆస్తులు, ఆర్థిక వివరాలను తమముందు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. తీర్పు ఉత్తర్వుల్లో డిస్ట్రెస్ వారెంట్ అనే పదాన్ని చేర్చింది.

అయితే దీన్ని అరెస్ట్ వారెంట్ గా తప్పుగా అర్థం చేసుకున్న పోలీసులు నీరజ్ ను నవంబర్ 25న రాత్రంతా జైలులో ఉంచారు. కానీ మరుసటి రోజు నీరజ్ న్యాయవాది కోర్టును ఆశ్రయించడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు నీరజ్ ను విడిచిపెట్టారు. జెహానాబాద్‌ ప్రాంతానికి చెందిన నీరజ్‌పై ఆయన భార్య రెండు సార్లు వరకట్నం వేధింపుల కేసు దాఖలుచేసింది. దీంతో 2014లో నీరజ్‌ విడాకుల కోసం దరఖాస్తు చేశారు.

More Telugu News