Telangana: తెలంగాణలో ముక్కోణపు పోరు జరుగుతోంది: బీజేపీ అగ్రనేత అమిత్ షా

  • తెలంగాణ భవిష్యత్ కు ఈ ఎన్నికలు కీలకం
  • ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి
  • మజ్లిస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారు

సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలతో తెలంగాణ ప్రజలపై వందల కోట్ల భారం మోపారని, ముక్కోణపు పోరు జరుగుతోందని బీజేపీ అగ్రనేత అమిత్ షా అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణ పేటలో జరుగుతున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ భవిష్యత్ కు ఈ ఎన్నికలు కీలకమని, ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో ఆయన విఫలమయ్యారని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేశారని, కేంద్రం ఆవాస్ పథకం కింద ఇచ్చిన నిధులను కేసీఆర్ పక్కదోవ పట్టించారని, ‘ఆయుష్మాన్ భారత్’ ను తెలంగాణలో అమలు చేయడం లేదని అన్నారు.

తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. మజ్లిస్ పార్టీ కాళ్ల వద్ద తెలంగాణ స్వాభిమానాన్ని తాకట్టుపెట్టారని, ఆ పార్టీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదని  కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకొస్తే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామని చెప్పిన అమిత్ షా, మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమని అన్నారు.

రిజర్వేషన్ల పేరుతో ముస్లింలను కేసీఆర్ మోసం చేశారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మైనార్టీల పాట పాడుతున్నాయని, ఎవరు సీఎం అయినా తమ కాళ్ల దగ్గరే ఉండాలని మజ్లిస్ పార్టీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు నారాయణపేటను ప్రత్యేక జిల్లాగా చేయాలన్నా, యువతకు ఉద్యోగాలు కావాలన్నా, తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని అమిత్ షా కోరారు.

  • Loading...

More Telugu News