Telangana: చంద్రబాబును హైదరాబాద్ లో చూస్తుంటే ఆ భయంకరమైన రోజులు మాకూ గుర్తుకొస్తున్నాయి!: కేటీఆర్ సెటైర్లు

  • కరెంట్ అడిగితే రైతులను కాల్చిచంపారు
  • వ్యవసాయం దండగ అని చెప్పారు
  • కూకట్ పల్లి సభలో విమర్శలు గుప్పించిన మంత్రి

హైదరాబాద్ లో అడుగుపెడితే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పడంపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. చంద్రబాబును ఇప్పుడు తెలంగాణలో చూస్తుంటే తమకూ భయంకరమైన ఆ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. కరెంట్ అడిగిన రైతులను తుపాకులతో కాల్చివేసిన సంఘటనలు తమకు గుర్తున్నాయని కేటీఆర్ తెలిపారు. వ్యవసాయానికి మద్దతు ధర ఇవ్వాలని కోరితే.. వ్యవసాయం ఎందుకు దండగ అని చెప్పిన మాటలు ఇంకా మర్చిపోలేదన్నారు. కూకట్ పల్లిలో ఈరోజు కాపు సామాజికవర్గం నేతలు నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

‘హైదరాబాద్ ను నేనే కట్టా.. ప్రతీదాన్నీ నేనే అభివృద్ధి చేశా’ అంటూ గత 20 ఏళ్లుగా అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డును చంద్రబాబు వినిపిస్తూనే ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. ఆయన మాటలతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు గత ఎన్నికల్లో ఆంధ్రాకు సాగనంపారని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ ఆయన ప్రవర్తన మార్చుకోలేదనీ, మరోసారి తెలంగాణలో వేలు పెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు తెలంగాణలో జోక్యం చేసుకుంటే.. తామూ ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News