Andhra Pradesh: విభిన్న పంచాంగాలకు స్వస్తి.. పండుగల్లో గందరగోళానికి చెక్.. ఈ ఏడాది నుంచే అమలు

  • ఇక భేదాభిప్రాయాలకు చెక్
  • అందరూ కలిసి ఒకే ఒకే పంచాంగాన్ని రూపొందించాలని నిర్ణయం
  •  మరోమారు సమావేశం కానున్న పంచాంగకర్తలు

ఇటీవల ప్రతీ ముఖ్యమైన పండుగ సందర్భంలోనూ భేదాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు ఒక రోజంటే మరికొందరు ఇంకో రోజంటూ చర్చలకు కారణమవుతోంది. ఫలితంగా పండుగ ఎప్పుడు జరుపుకోవాలో తెలియక ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఇకపై ఇటువంటి తికమకకు తావు లేకుండా విభిన్న పంచాంగాల స్థానంలో ఒకే పంచాంగాన్ని తీసుకురావాలని హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టు(హెచ్‌డీపీటీ), అర్చక శిక్షణ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో తాడేపల్లిలోని ‘సితా’ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పంచాంగకర్తలు నిర్ణయించారు. ఈ సమావేశంలో ఏపీలోని ఏడు ప్రధాన ఆలయాల పంచాంగకర్తలు, అర్చకులు, టీటీడీ పంచాంగకర్తలు పాల్గొన్నారు.  ఈ నెల 10 నుంచి 12 వరకు మరోమారు సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయ శాఖ, ప్రధాన ఆలయాలు వేర్వేరుగా పంచాంగాలు రూపొందిస్తున్నాయి. పండుగల విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా తేదీలను నిర్ణయిస్తుండడంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడుతోంది. చివరికి వారి విచక్షణతోనే పండుగ జరుపుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా దేవాదాయ శాఖ, టీటీడీ మధ్య తరచూ భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఇకపై ఈ భిన్నాభిప్రాయాలకు ఫుల్‌స్టాప్ పెట్టి అందరూ కలిసి ఒకే పంచాంగాన్ని రూపొందించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది రానున్న వికారినామ సంవత్సరం నుంచే కొత్త పంచాంగాన్ని అమల్లోకి తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించారు.

More Telugu News