Telangana: బకాయిల చెల్లింపుల్లో జాప్యం.. నేటి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్

  • నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ. 1200 కోట్ల బకాయిలు
  • ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నామన్న నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఘం
  • అత్యవసరంగా రూ. 150 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

తమకు రావాల్సిన బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తున్నందుకు నిరసనగా నేటి నుంచి ఆరోగ్య శ్రీ పథకం కింద అన్ని వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఘం ప్రకటించింది. ప్రభుత్వం నుంచి ఏకంగా రూ.1200 కోట్లు రావాల్సి ఉందని, అవి రాకపోవడంతో ఆసుపత్రులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయని సంఘం పేర్కొంది. విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఆరోగ్య శ్రీ ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొంది. ఆరోగ్య శ్రీ సేవలతోపాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్), పాత్రికేయుల ఆరోగ్య పథకం (జేహెచ్ఎస్) సేవలు కూడా ఆపివేయనున్నట్టు తెలిపింది.

ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయనున్నట్టు నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఘం ప్రకటించడంతో స్పందించిన ప్రభుత్వం శుక్రవారం అత్యవసరంగా రూ.150 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే వంద కోట్ల రూపాయలు నెట్‌వర్క్ ఆసుపత్రులకు చేరినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నెలలోనే మిగతా బకాయిలను చెల్లించనున్నట్టు పేర్కొంది. బకాయిల విడుదలలో జాప్యం కారణంగా సేవలు నిలిపివేయడం బాధాకరమని, తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆరోగ్య శాఖ కోరింది.

More Telugu News