visakha utsav: ప్రజాదరణ పొందేలా విశాఖ ఉత్సవాల నిర్వహణ : మంత్రి గంటా

  • 28, 29, 30 తేదీల్లో నిర్వహణకు భారీ ఏర్పాట్లు
  • ఈసారి స్థానిక కళాకారులకు భాగసామ్యం కల్పిస్తామని స్పష్టీకరణ
  • సిటీ సెంట్రల్‌ పార్క్‌లో పుష్ప ప్రదర్శన

నగర ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి ప్రజాదరణ పొందేలా విశాఖ ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. డిసెంబరు 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న ఉత్సవాల్లో స్థానిక కళాకారులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. విశాఖలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఉత్సవం ప్రారంభం రోజున బ్రెజిల్‌ తరహా కార్నివాల్‌ నిర్వహిస్తామని, నౌకాదళ బ్యాండ్‌, ఎయిర్‌ షో ఉంటాయని చెప్పారు.

ప్రజాకర్షణ కోసం రాఫెల్‌ డ్రా నిర్వహిస్తామని, విజేతకు ఇచ్చే బహుమతులను ముందుగానే వేదికపై ప్రదర్శిస్తామని తెలిపారు. పలురంగాల్లో ప్రముఖులకు పురస్కారాలు అందించనున్నట్టు చెప్పారు. ఆర్కే బీచ్‌లో రెండు ప్రధాన వేదికలు, వరుణ్‌ బీచ్‌ వద్ద జాతర నిర్వహిస్తామని తెలిపారు. ఉత్సవం మూడు రోజులు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. నగరాన్ని విద్యుత్‌ దీపకాంతులతో జిగేల్‌మనిపిస్తామని చెప్పారు.

ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.3.5 కోట్లు విడుదల చేసిందని, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ చెరో రూ.50 లక్షలు ఖర్చు చేస్తాయని తెలిపారు. ఇక ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణ పుష్ప ప్రదర్శనను సిటీ సెంట్రల్‌ పార్క్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాల మూడు రోజులు సందర్శన ప్రాంతాల్లోకి ఉచిత ప్రవేశం కల్పిస్తామని స్పష్టం చేశారు. డిసెంబరు 23 నుంచి హెలీటూరిజాన్ని కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు.

More Telugu News