Pawan Kalyan: అశోక్ గజపతి రాజుకు నేనెవరో తెలియదట.. మొన్నవెళ్లి ఆ పవన్ కల్యాణ్ నేనే అని చెప్పి వచ్చాను: పవన్

  • బాబు, లోకేశ్, జగన్‌లు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు
  • గత ఎన్నికల్లో జగన్‌తో అందుకే చేతులు కలపలేదు
  • అవినీతి రహిత పాలన అందిస్తా
‘‘పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని టీడీపీ నేత అశోక్ గజపతి రాజు అన్నారట. అందుకే మొన్న వెళ్లి కనిపించి పవన్ కల్యాణ్ అంటే నేనే అని పరిచయం చేసుకున్నా’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మూడో విడత ప్రజాపోరాట యాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిలపై మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

చంద్రబాబు విజన్ 2020, 2050 అని పదేపదే చెబుతారని, అవన్నీ డబ్బు సంపాదనకేనా? అని ప్రశ్నించారు. అమరావతి పేరుతో రైతుల నుంచి భూములు లాక్కొని వాటిని విదేశీ బ్యాంకుల్లో తాకట్టు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు మాట్లాడితే సింగపూర్ అంటారని, అక్కడ ఎకరం భూమి కనుక తీసుకుంటే పదుల సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తారని, ఇక్కడ ఎన్ని ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ దేశం కోసం జైలుకు వెళ్లలేదని, అవినీతి సొమ్ము గడించి జైలుకు వెళ్లారని ఆరోపించారు. ఆ విషయం తెలిసే గత ఎన్నికల్లో ఆయనతో చేతులు కలపలేదని పవన్ పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేశ్, జగన్ కలిసి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో జనసేనను గెలిపిస్తే అవినీతి రహిత పాలన అందిస్తానని పవన్ హామీ ఇచ్చారు.
Pawan Kalyan
East Godavari District
Amalapuram
Jagan
Chandrababu
Nara Lokesh

More Telugu News