Maharashtra: నెరవేరిన మరాఠాల పోరాటం.. 16 శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన మహారాష్ట్ర అసెంబ్లీ!

  • మూజువాణి ఓటుతో మండలిలోనూ ఆమోదం
  • గతకొంతకాలంగా ఉద్యమిస్తున్న మరాఠా ప్రజలు
  • అన్ని పార్టీల నేతలకు సీఎం ఫడ్నవీస్ కృతజ్ఞతలు

మహారాష్ట్రలో రిజర్వేషన్ కోసం ఉద్యమిస్తున్న మరాఠాల పోరాటానికి ఎట్టకేలకు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం దిగివచ్చింది. మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఈరోజు మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును అన్ని పార్టీల శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ఈ బిల్లును తదుపరి ఆమోదం కోసం స్పీకర్ శాసనమండలికి పంపారు.  దీంతో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావాలంటూ ఉద్యమిస్తున్న మరాఠాల చిరకాల కోరిక నెరవేరినట్లయింది.

ఈ విషయమై మహారాష్ట్ర సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. మరాఠా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చిన నేతలందరికి కృతజ్ఞతలు తెలిపారు. తాజా నిర్ణయంతో మరాఠాలకు అన్నిరంగాలలోనూ న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర జనాభాలో సుమారు 30 శాతంగా ఉన్న మరాఠాలు గత కొన్నిరోజులుగా రిజర్వేషన్ కోసం ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఇటీవలి కాలంలో కొన్ని మరాఠా సంఘాలు చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో మరాఠాల రిజర్వేషన్ ప్రతికూలాంశంగా మారుతుందని భావించిన కమలనాథులు ముందు జాగ్రత్తగా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

More Telugu News