Andhra Pradesh: ఆయేషా మీరా కేసు.. విచారణను సీబీఐకి అప్పగించిన హైకోర్టు!

  • 2007, డిసెంబర్ 27న హాస్టల్ లో హత్య
  • విచారణలో పురోగతి సాధించని పోలీసులు
  • మిస్టరీగా మారిన ఆయేషా మీరా హత్య

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర సంచలనం రేపిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ పోలీసులు ఈ కేసు విచారణలో ఇప్పటివరకూ ఎలాంటి పురోగతి సాధించనందున దీన్ని సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ విచారణను త్వరితగతిన ముగించి నివేదికను సమర్పించాలని సీబీఐ న్యాయవాదిని ఆదేశించింది.

2007 డిసెంబర్‌ 27న బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా విజయవాడలోని ఓ హాస్టల్‌లో హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో అప్పటి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నాయి. హాస్టల్ లోని బాత్రూమ్ లో రక్తపు మడుగులో పడి ఉన్న ఆయేషాను గుర్తించిన నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. తన ప్రేమను తిరస్కరించడంతోనే ఆయేషాను హత్య చేసినట్లు మృతదేహం పక్కన ఓ లేఖ లభ్యమయింది.

ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం అనాసాగరం గ్రామానికి చెందిన సత్యం బాబుని పోలీసులు ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేశారు. అయితే సత్యంబాబు అరెస్టు ఎన్నో అనుమానాలకు దారి తీసింది. నిజమైన నేరస్థులను రక్షించే ఉద్దేశంతోనే సత్యం బాబును అరెస్ట్ చేశారంటూ అతడి బంధువులు, మానవహక్కుల కార్యకర్తలు ఆరోపించారు. చివరకు ఈ కేసును విచారించిన ఉమ్మడి హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా విడుదల చేస్తూ గతేడాది ఏప్రిల్ లో తీర్పు ఇచ్చింది. దీంతో తాజాగా దోషుల్ని పట్టుకునేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.

  • Loading...

More Telugu News